బ్రిటిష్ వారు భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూనే పాకిస్తాన్ పేరిట ముక్కలు చేసి పోయారు.. అంతే కాదు దేశంలోని 552 స్వదేశీ సంస్థానాల భవిష్యత్తును తేల్చలేదు.. భారత దేశంలో ఉంటారో, పాకిస్తాన్ లో చేరతారో, స్వతంత్ర్యంగా ఉంటారో మీరో తేల్చుకోండి అనే ఉచిత సలహాను సంస్థానాధీశులకు ఇచ్చి మరీ వెళ్లిపోయారు ఆంగ్లేయులు.. స్వతంత్ర భారత దేశం ముందున్న పెద్ద సవాల్ అది.. ఒక రకంగా దేశ అస్థిత్వానికి ప్రమాదకరమైన స్థితి..
ఇలాంటి పరిస్థితుల్లో భారత దేశ తొలి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టాడో దార్శనికుడు.. తక్షణ కర్తవ్యంగా అందరు సంస్ధానాధీశులకు నచ్చజెప్పి భారత దేశంలో విలీనానికి ఒప్పించాడు.. మొండికేసిన హైదరాబాద్ పై సైనిక చర్య చేపట్టి నిజాం నవాబు మెడలు వంచాడు.. ఈ రోజుల భారత దేశాన్ని ఇంతటి సమగ్ర రూపంలో చూడగలుగుతున్నామంటే అందుకు కారణం ఆ మహానీయుని పుణ్యమే.. ఆయనే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్..
1875 అక్టోబర్ 31న గుజరాత్ లోని నాడియార్ గ్రామంలో పుట్టిన వల్లభాయ్ పటేల్ ఇంగ్లాండ్ లో బారిస్టర్ చదివారు. అహ్మదాబాద్ లో ప్రాక్టీసు మొదలు పెట్టి న్యాయవాదిగా విశేష కీర్తి ప్రతిష్టలు, ధనం ఆర్జిస్తున్న సమయంలో దేశ పరిస్థితులు ఆయను కలచివేశాయి.. పటేల్ అన్నింటికీ వదులుకొని స్వాతంత్రోద్యమంలోకి దిగారు.. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకునిగా పేరు తెచ్చుకున్నారు.. స్వతంత్ర్య భారత దేశానికి తొలి ప్రధాని కావాల్సిన అర్హత ఉన్నా, గాంధీజీ నెహ్రూ వైపు మొగ్గు చూపారు. దేశ తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ శర వేగంగా పరిస్థితులను సరిదిద్దారు.. కేవలం 40 నెలలు మాత్రమే హోంమంత్రి పదవిలో ఉండి మరణించిన పటేల్ సేవలను దేశం ఆనాటికీ స్మరించుకుంటోంది అంటే అందుకు కారణం ఆయన గొప్పతనమే..
మహాదార్శనీకుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు సమీపంలో నర్మదా నదిలో ఆయన విగ్రహాన్ని అవిష్కరిస్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా పేరు తెచ్చుకుంది.. ఆధునిక భారత దేశాన్ని ఏకం చేసిన మహనీయుడు సర్దార్ పటేల్.. అందుకే ఆయన విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా మూర్తి) అనే పేరు పెట్టారు.. మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐక్యతా విగ్రహా నిర్మాణం ప్రారంభమైంది.. ఐక్యతా మూర్తి ప్రాజెక్టు స్పూర్తిని వివరిస్తూ మన ప్రధాని చెప్పిన మాటలు ఇవి..
భాషలు అనేకం.. భావం ఒక్కటే
రాష్ట్రాలు అనేకం.. దేశం ఒక్కటే
రంగులు అనేకం.. పతాకం ఒక్కటే
మాటలు అనేకం.. గొంతు ఒక్కటే
ఆచారాలు అనేకం.. సంస్కృతి ఒక్కటే
సమాజాలు అనేకం.. భారత్ ఒక్కటే
పనులు అనేకం.. సంకల్పం ఒక్కటే
మార్గాలు అనేకం.. లక్ష్యం ఒక్కటే
పథకాలు అనేకం.. ప్రయోజనం ఒక్కటే
వ్యక్తీకరణలు అనేకం.. ప్రతిభ ఒక్కటే
అదీ ఈ ఐక్యత మూర్తి స్ఫూర్తి..
దురదృష్టవశాత్తు కొందరు మూర్ఖులు సర్ధార్ పటేల్ విగ్రహం విషయంలో సంకుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఒక కుటుంబ పేరు ప్రతిష్టల కోసం పటేల్ చరిత్రను తక్కువ చేసిన పార్టీతో పాటు కొందరు ఓర్వలేని నాయకులు, ఉన్మాదులు, విచ్చినకర శక్తులు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. దేశాన్ని ఏకం చేసిన ఒక మహానీయుని స్పూర్తిని గుర్తు చేసుకుంటూ, భావితరాలకు అందించే ఐక్యతా మూర్తికి జేజేలు పలుకుదాం.. (అక్టోబర్ 31న సర్దార్ పటేల్ జయంతి)